భలే మంచి..కారుచౌక బేరం

భలే మంచి..కారుచౌక బేరం

user-default | Mob: | 19 Oct

ఆర్థిక మందగమనం వాహన అమ్మకాలను కుదిపేస్తోంది...ఆ గండం నుంచి గట్టెక్కడానికి తయారీ కంపెనీలు ఆఫర్ల వల విసురుతున్నాయి... డిస్కౌంట్లతో హోరెత్తిస్తున్నాయి... ఊహించని రాయితీలిస్తున్నాయి... ఏళ్లకొద్దీ ఉచిత సర్వీసులంటున్నాయి...ఎక్స్ఛేంజ్‌ బోనస్‌లు ప్రకటిస్తున్నాయి... బంగారు నాణేలూ ఇస్తామంటున్నాయి... కారు కొనాలనుకునే మారాజుకి, బైక్‌ ఓనరవ్వాలనుకునే వీరులకి ఇది మంచి సమయం అన్నది అనుభవజ్ఞుల మాట. ఆర్థిక మందగమనంలో అన్నిరంగాలతో పాటు ఆటోమొబైల్‌ దిగాలు పడిపోతోంది. ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వాహనాల అమ్మకాలు పడిపోయాయన్నది లెక్క. ఈ పరిస్థితి మార్చడానికి తయారీదారులు, డీలర్లు తలో చేయి వేస్తున్నారు. వినియోగదారుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆఫర్ల వరాలు కురిపిస్తున్నారు. సాధారణంగా పండగలు, సంవత్సర ముగింపు సమయాల్లోనే కార్లు, ద్విచక్రవాహనాలపై ఈరకమైన రాయితీలిస్తారు. అదీ హ్యాచ్‌బాక్‌, సెడాన్‌లాంటి కొన్ని సెగ్మెంట్లకే పరిమితం. ఇప్పుడేమో చిన్న కార్ల నుంచి లగ్జరీ వరకు అన్నింట్లోనూ తగ్గింపే. అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్లు, డెలివరీకి నెలలకొద్దీ ఎదురుచూసే వాహనాలపైనా ఇదే తీరు. ప్రస్తుతం ఆఫర్లు పీక్‌ స్థాయిలో ఉన్నాయనీ, ఇంతకు మించి ఇవ్వడం వాహన తయారీదారులు, డీలర్లకు బహుశా సాధ్యం కాకపోవచ్చని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఫాడా) డైరెక్టర్‌ నిఖంజ్‌ సంఘీ అభిప్రాయం. పరిస్థితి కాస్త సద్దుమణిగితే డిస్కౌంట్లు ఉండకపోవచ్చన్నది ఆటోమొబైల్‌ పండితుల మాట. అందుకే కొనుగోలుదారులకు ఇది మంచి సమయం. బేరమాడితే మరింత చౌకగానూ దొరకొచ్చు. ఎందుకంటే.. * రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత తక్కువగా ఆటోమొబైల్‌ అమ్మకాలు పడిపోయాయి. ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం తోడైంది. వీటిని కొంతైనా కవర్‌ చేసుకోవడానికి తయారీ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. * అమ్మకాలు ఆగిపోతే స్టాకులో ఉన్నవి పాతవాటి కిందకి వచ్చేస్తాయి. వాటిని వదిలించుకోవడం కష్టం. తప్పనిసరై డిస్కౌంట్లు ఇస్తున్నారు. * రకరకాల కారణాలతో కొన్ని మోడళ్లు అమ్ముడవవు. సమయం, సందర్భం కలిసి రావడంతో వీటిపైనే ఎక్కువ రాయితీలిస్తున్నారు. * కొత్త వాహనాలన్నీ బీఎస్‌ 6 ప్రమాణాలతోనే తయారవ్వాలని ప్రభుత్వం నిబంధన విధించింది. పాత బీఎస్‌ 4 వాహనాలను వీలైనంత త్వరగా అమ్మడానికి కంపెనీలు ప్రోత్సాహకాలిస్తున్నాయి. * విద్యుత్తు బ్యాటరీ కార్లకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలిస్తోంది. కొత్తగా బండి కొనాలనుకునేవాళ్లు కొన్నాళ్లు ఆగుదాం అనే ధోరణిలో ఉన్నారు. వీళ్లని ఆకట్టుకోవడానికి సైతం ఈ ఆఫర్లు. * ఆర్‌బీఐ వరుసగా రెపోరేటు తగ్గించుకుంటూ వస్తోంది. దానికనుగుణంగా బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీరేటు తగ్గించమని ఆదేశించింది. వాహన రుణాల్లో వడ్డీ రేటు ఈమధ్యే 0.25శాతం తగ్గించారు. ఈ ప్రయోజనాన్ని డీలర్లు వినియోగదార్లకు బదలాయిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కంపెనీలు మంచి తగ్గింపునిస్తున్నాయి. దసరా, దీపావళి పండగ సమయాల్లోనూ ఇవి కొనసాగుతాయి. ఆర్థిక వ్యవస్థ మందగమన ప్రభావం ఒక్క ఆటోమొబైల్‌పైనే కాదు.. అన్ని రంగాలపైనా ఉంది. 2008-09లో ఇంతకన్నా కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాం. కొత్త కార్ల అమ్మకాలు కొంచెం తగ్గినా పాతవి రెట్టింపు అవుతున్నాయి. అమేజ్‌ మోడల్‌ అమ్మకాలపై ఎలాంటి ప్రభావం లేదు. ప్రీమియం కార్లలో ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తున్నారు. నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్‌, యాక్సెసరీలపై రాయితీలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. వాహన రుణసంస్థలూ ఈమధ్యే వడ్డీరేటు తగ్గించాయి. కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్‌ ఫీజు తీసేశాయి. ఈరకంగా చూస్తే కొనుగోలుదారులకు ఇది మంచి సమయం. బీఎస్‌ 6 వాహనాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఇలాంటి ఆఫర్లు కొనసాగకపోవచ్చు. ధరలు పెరుగుతాయి. - రాకేశ్‌కుమార్‌ గార్లపాటి, ప్రైడ్‌ హోండా సీఈవో భారీ తగ్గింపు నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌, విడిభాగాలపై రాయితీ, ఉచిత సర్వీసింగ్‌, ఉచిత నిర్వహణ, ఉద్యోగులకు ప్రత్యేక తగ్గింపులు, బోనస్‌లు, గోల్డ్‌ కాయిన్‌ అంటూ రకరకాల ఆఫర్ల ద్వారా కొన్ని మోడళ్లపై ప్రస్తుతం తగ్గించిన మొత్తాలివి. హోండా సీఆర్‌-వీ- రూ.4 లక్షలు స్కోడా కోడియాక్‌- రూ.2.75లక్షలు హ్యుందాయ్‌ ఎలాంత్రా- రూ.2లక్షలు టయోటా ఇన్నోవా- రూ.1.95లక్షలు ఫోక్స్‌వాగన్‌ టిగువాన్‌- రూ.1.75లక్షలు టయోటా ఫార్చునర్‌- రూ.1.2లక్షలు హ్యుందాయ్‌ ఐ10- రూ.95వేలు స్విఫ్ట్‌ డిజైర్‌- రూ.74వేలు మహీంద్రా కేయూవీ100- రూ.73వేలు మహీంద్రా టీయూవీ 300- రూ.72వేలు మారుతీ సియాజ్‌- రూ.70వేలు డాట్సన్‌ రెడి-గో - రూ.65వేలు మారుతీ సెలేరియో (సీఎన్‌జీ)- రూ.57వేలు నిస్సాన్‌ కిక్స్‌- రూ.35వేలు * టాటా మోటార్స్‌ టాటా నెక్సాన్‌, టియాగో, హెక్సా మోడళ్లపై 3+3+3+ అనే ఆఫర్‌ ఇస్తోంది. మూడేళ్ల ఉచిత సర్వీసింగ్‌, వార్షిక నిర్వహణ ప్యాకేజీ, వీటితోపాటు ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ కింద మరో రూ.30వేల వరకు తగ్గింపునిస్తున్నారు. మూడు గ్రాముల బంగారు నాణెం ఇస్తున్నారు. * హీరో మోటోకార్ప్‌ స్కూటర్లపై రూ.4వేల వరకు నగదు తగ్గింపు ప్రకటించింది. బజాజ్‌ ఆటో, టీవీఎస్‌ మోటార్స్‌ ఎంపిక చేసిన రాష్ట్రాల్లో జీరో వడ్డీరేటుతో రుణాలు అందిస్తున్నాయి.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved