పరిష్కార సూచిక... డీఆర్సీ వేదిక

పరిష్కార సూచిక... డీఆర్సీ వేదిక

user-default | Mob: | 22 Oct

చాలా కాలం తరువాత జిల్లాలో కీలకమైన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి విధానపరంగా తీసుకున్న మౌలిక నిర్ణయాలకు డీఆర్సీ వేదికైంది. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కసారి కూడా జిల్లా సమీక్షా మండలి సమావేశం నిర్వహించకుండా ప్రజా సమస్యలను గాలికొదిలేసిన నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు తిరగకుండానే తొలి డీఆర్సీని నిర్వహించడం విపక్ష సభ్యుల ప్రశంసలు అందుకుంది. ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) అధ్యక్షతన కాకినాడ జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ అధికార, ప్రతిపక్ష సభ్యులు తీసుకువచ్చిన సమస్యలకు మంత్రులు సమాధానమిచ్చారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన డీఆర్సీ సుదీర్ఘంగా తొమ్మిది గంటలపాటు సాయంత్రం 6.30 గంటల వరకు జరగడం ఒక రికార్డే. శాఖల సమీక్ష అంటే మొక్కుబడిగా నిర్వహించే గత టీడీపీ సర్కార్‌ సంస్కృతికి భిన్నంగా ప్రజాప్రతినిధులు తీసుకువచ్చిన ప్రతి అంశంపై లోతుగా చర్చించి నిర్దేశిత గడువులోగా పరిష్కార మార్గాన్ని కూడా మంత్రులు సూచించడంతో విపక్షం నోరెత్తలేని పరిస్థితి కనిపించింది. తొలిసారి ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ప్రాంత సమస్యలపై డీఆర్సీలో గళం వినిపించేందుకు పోటీపడ్డారు. విపక్షాలకు అవకాశం ఇస్తూ... సమస్యలపై చర్చలో పాల్గొనే అవకాశాన్ని కోరినంత సేపు విపక్ష టీడీపీ సభ్యులకు కూడా ఇవ్వడం ద్వారా తమది పూర్తి పారదర్శక ప్రభుత్వమనే విషయాన్ని మంత్రులు నొక్కి చెప్పారు. పది శాఖలను అజెండాలోకి తీసుకువచ్చారు. శుక్రవారం ఎలాగూ వైద్య ఆరోగ్యశాఖపై రోజంతా సమీక్ష ఉండటంతో ఆ శాఖ సమీక్షను డీఆర్సీ నుంచి మినహాయిస్తున్నట్టు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాని ముందుగానే సభ్యుల దృష్టికి తీసుకు వచ్చారు. మిగిలిన వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్, విద్య, గృహనిర్మాణం, సాంఘిక సంక్షేమం, జిల్లా గ్రామీణాభివృద్ధి, మైనింగ్, గ్రామీణ మంచినీటి సరఫరా, పౌర సరఫరాలు తదితర శాఖలపై లోతైన సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా జరిగిన పంట నష్టంపై ఎకరాకు రూ.25 వేలు డిమాండ్‌ చేస్తున్న చంద్రబాబు తీరును మంత్రి కన్నబాబు తూర్పారబట్టారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved