రేషన్ కార్డులో చేర్పులు మార్పులు చేసుకునే అవకాశం..

రేషన్ కార్డులో చేర్పులు మార్పులు చేసుకునే అవకాశం..

user-default suresh gona | Mob: 7799146666 | 28 Oct

దాదాపు పది నెలల తర్వాత రేషన్‌ కార్డుల్లో(బియ్యం కార్డుల్లో) మార్పులు, చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. గతేడాది నవశకం సర్వేకి ముందు రేషన్‌ కార్డుల్లో(అడిషన్‌, డిలీషన్‌, సరండర్‌, కరెక్షన్‌, స్ల్పిటింగ్‌)పేర్లు తొలగింపు, చేర్పులను నిలిపివేసిన విషయం విదితమే. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నవరత్నాల పథకాల లబ్ధిదారుల ఎంపికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నవశకం సర్వే నిర్వహించింది. దీంతోపాటు అనర్హులు అధికశాతం మంది రేషన్‌ కార్డులు కలిగి ఉన్నారన్న కారణంతో సర్వేలో వాటి ఏరి వేతకు శ్రీకారం చుట్టింది. కుటుంబంలో ఎవరైనా ఉద్యోగులు, ప్రభుత్వ పింఛనుదారులు ఉంటే గుర్తించి ఆన్‌లైన్‌లో సదరు రేషన్‌ కార్డులను నిలిపివేశారు. రేషన్‌ కార్డులను ప్రామాణికంగా తీసుకుని ఒకే కుటుంబంలో ఇద్దరు పింఛను లబ్ధిదారులున్నా ఒక పింఛనుకు కోతపడింది. ఇటువంటి వారంతా జిల్లాలో వేలాదిమంది ఉన్నారు. అప్పట్లో తమ పేర్లను రేషన్‌ కార్డుల్లో తొలగించుకునేందుకు, మార్పులు చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం రేషన్‌కార్డుల్లో మార్పులు, చేర్పులు, తొలగింపులు, స్ల్పిట్టింగ్‌ సేవల సైట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా కొత్త బియ్యం కార్డుల మంజూరుకు అవకాశం కల్పించిన పౌరసరఫరాలశాఖ అధికారులు మరో నాలుగు అంశాలకు వీలు కల్పించారు. కార్డులో పేర్లు చేర్చడం, తొలగించడం, కార్డు నుంచి వేరు పడటం, సరెండర్‌కు అవకాశం కల్పించారు. ఇందులో ఏ సేవలు పొందాలన్నా గ్రామ/వార్డు సచివాలయాల్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.. దరఖాస్తును పరిశీలించి అన్ని సరిపోతే పది రోజుల్లోనే కొత్తకార్డు మంజూరవుతుంది. చేర్పులు, మార్పుల ప్రక్రియ కూడా పది రోజుల్లోనే పూర్తవుతుంది. ఇది వరకూ కార్డులు పొంది వద్దనుకునే వారు తిరిగి అధికారులకు ఇచ్చేయవచ్ఛు మరోచోటుకు బదిలీకి అవకాశం ఉందని జిల్లా పౌరసరఫరాల అధికారి తెలిపారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved