ప్రజలు రౌడీయిజానికి ఓటేయలేదు

ప్రజలు రౌడీయిజానికి ఓటేయలేదు

user-default | Mob: | 25 Oct

మంచి చేస్తారని భావించి ప్రజలు వైకాపాకు ఓట్లేసి గెలిపించారు తప్ప.. రౌడీయిజానికి కాదని మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అనంతపురం, ప్రకాశం, గుంటూరు.. ఇలా నిత్యం ఏదో ఒక జిల్లాలో తెదేపా కార్యకర్తలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఎన్నికల్లో తెదేపాకు సహకరించారన్న కారణంతో సంఘమిత్రలను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. ప్రభుత్వం దాడులను మానుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని హితవు పలికారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా బుధవారం గుడుపల్లి, కుప్పం మండలాల్లో చంద్రబాబు పర్యటించారు. రోడ్డుషోలతో పాటు.. కార్యకర్తల అంతర్గత సమావేశాల్లో ప్రసంగించారు. ‘నా నియోజకవర్గ పర్యటనకు వస్తుంటే పార్టీ జెండాలను కట్టకుండా అడ్డుకున్నారు. ఇలా చేస్తుంటే బాధ వేయదా? మాజీ ముఖ్యమంత్రే భయపడితే ఇక సామాన్యులకు రక్షణ ఉంటుందా? ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మేం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంపై వివక్ష చూపించామా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘నన్ను ఏం చేసినా ఫర్వాలేదు. నన్ను నమ్ముకున్నవారు, కార్యకర్తల జోలికి వస్తే మాత్రం పోరాటం చేస్తా. ప్రభుత్వం హామీలను అమలు చేయకుంటే రోడ్డెక్కుతాం. ప్రజలను చైతన్యవంతులను చేస్తాం’ అని స్పష్టం చేశారు. ‘నేను అన్ని పనులూ చట్ట ప్రకారమే చేశా. అధికారంలో ఉన్నప్పుడు ఏ తప్పూ చేయలేదు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 26 విచారణ కమిటీలు వేసినా ఏమీ తేల్చలేకపోయారు’ అని గుర్తు చేశారు. అధైర్యపడొద్దు... ‘ఎన్నికల ప్రక్రియ ముగిసి 40 రోజులైనా ఇంకా కొందరు కార్యకర్తలు ఓటమిని జీర్ణించుకోలేకపోవడం నా మనసును కలచి వేస్తోంది. అనంతపురంలో కియా మోటార్స్‌ పరిశ్రమ పెట్టించా. అయినా అక్కడ ఓడిపోయాం. కొంతమంది కార్యకర్తలు, నాయకులు అధైర్యపడుతున్నారు. మీ కష్టాలు విన్నా. నేనున్నా. అధైర్యపడొద్దు. అన్ని విధాలుగా అండగా ఉంటా’ అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ‘ఎన్నికల్లో ఓడిన వెంటనే స్వలాభం కోసం పక్క పార్టీల్లోకి పోతే.. అది అవకాశవాదం అవుతుంది. మన పార్టీలో ఉండి పనులు చేయించుకున్నవారు.. ఇప్పుడు ఇంకొకరి దగ్గరకు వెళ్లి పనులు చేయించుకోవడమూ మంచి పద్ధతి కాదు. ఎందరు పార్టీని వీడినా.. మళ్లీ ఒక సమర్థ నాయకత్వాన్ని తయారు చేస్తా’ అని పేర్కొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved