ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు మంత్రి పేర్ని నాని హెచ్చరిక

ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు మంత్రి పేర్ని నాని హెచ్చరిక

user-default | Mob: | 25 Oct

నిబంధనలను ఉల్లంఘించి అడ్డగోలుగా బస్సులు నడుపుతున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని అధికారులను ఆదేశించారు. టూరిస్ట్‌ పర్మిట్లు తీసుకుని కాంట్రాక్ట్‌ క్యారేజీలుగా బస్సులు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. సరైన అనుమతి పత్రాలు లేకుండా తిరుగుతున్న బస్సులను తనిఖీ చేసి సీజ్‌ చేయాలని సూచించారు. విజయవాడలోని రవాణా శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రైవేట్‌ ట్రావెల్స్ తనిఖీలు, రహదారి ప్రమాదాల నివారణపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. అధికారులంతా జాతీయ రహదారులపై ముమ్మర తనిఖీలు చేయాలని ఆదేశించారు. ట్రావెల్స్ బస్సుల్లో ప్యాసింజర్ జాబితా ముందే పొందుపరచాలని.. నిబంధనలు ఉల్లంఘించి నడిపే బస్సుల్ని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. విలీనంపై అధ్యయన ప్రక్రియ కొనసాగుతోంది ప్రభుత్వమంటే లెక్కలేనితనంగా భావించి బస్సులు నడపొద్దని ట్రావెల్స్ యజమానులను మంత్రి హెచ్చరించారు. స్టేజి క్యారేజీలుగా బస్సులను నడిపేవారు వెంటనే ఆపేయాలని.. లేదంటే ఇబ్బందులు పడతారన్నారు. రహదారి ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నామని.. దీనికోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాల నివారణకు రూ.100కోట్ల రివాల్వింగ్ ఫండ్ ఇచ్చేందుకు సీఎం అంగీకరించారని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం కోసం అధ్యయన ప్రక్రియ కొనసాగుతోందని.. 90 రోజుల్లో కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. సీఎం ఆదేశాలతో పాటు అందరి అభిప్రాయాలు తీసుకుని విశ్లేషించి తగు సిఫార్సులతో కమిటీ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తుందన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved