ఆలయ భూములు హాంఫట్‌ - చేతులు మారిన 270 ఎకరాలు

ఆలయ భూములు హాంఫట్‌ - చేతులు మారిన 270 ఎకరాలు

user-default | Mob: | 25 Oct

రూ.కోట్ల విలువైన ఆలయ భూములు అక్రమార్కుల పరమయ్యాయి. కొందరు అధికారుల సహకారంతో కబ్జాదారులు భూములను పంచేసుకున్నారు. వందలాది ఎకరాల భూములు చేతులు మారాయి. అక్రమాలకు రాజకీయ జోక్యం తోడవడంతో ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సైతం దృష్టి సారించలేక పోయారు. దీంతో ఆలయ ప్రగతిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని సర్పవరంలో ఉన్న రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణస్వామి దేవస్థానం భూముల పరాధీన చిత్రమిది. ఆలయ పోషణ కోసం పిఠాపురం మహారాజు ఇచ్చిన విలువైన భూములు అన్యాక్రాంతం కావడం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భావనారాయణ స్వామి ఆలయానికి దేశ వ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. ఒకప్పుడు వందల ఎకరాల మాన్యంతో కళకళలాడిన ఈ ఆలయానికి ఆక్రమణల సెగ తగలడంతో ఆస్తులన్నీ క్షీణించాయి. ఆలయానికి రక్షకులుగా నిలవాల్సిన కొందరు ఉద్యోగుల నిర్వాకంతో దస్త్రాలు సైతం మాయమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో రెవెన్యూ, దేవాదాయ శాఖల యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. భావనారాయణస్వామి ఆలయానికి చెందిన 360 ఎకరాల భూముల్లో ప్రస్తుతం లీజులు, స్వాధీనంలో ఉన్నవి కేవలం 89.50 ఎకరాలు మాత్రమే కావడం గమనార్హం. ఆలయ సేవలో నిమగ్నమైన అర్చకుల్లో కొందరు ..మిగతా 7లోజీతాలకు పనిచేస్తుండగా.. ఓ అర్చకుడు మాత్రం 5.42 ఎకరాల భూమితో జీవనాన్ని సాగిస్తున్నారు. జగ్గంపేట పరిధిలోని రాజపూడి, సామర్లకోట మండలంలోని మాధవపట్నం, పిఠాపురం, కాకినాడ గ్రామీణ ప్రాంతాల్లో ఆలయ భూములను దేవాదాయ శాఖ లీజుకు ఇచ్చింది. లీజుకు ఇచ్చిన 84.50 ఎకరాల ద్వారా ఆలయానికి ఏటా వస్తున్న ఆదాయం రూ.8 లక్షలు మాత్రమే. నిబంధనల మేరకు వేలం నిర్వహిస్తే రూ.25 లక్షలకు పైనే ఆదాయం దక్కే అవకాశం ఉన్నా ఆ దిశగా అధికారులు చొరవ చూపడం లేదు. భూముల వేలం సమయంలో రాజకీయ ఒత్తిళ్లు కమ్మేయడంతో వారి సిఫార్సులకు పెద్దపీట వేయాల్సిన పరిస్థితి నెలకొంది. లీజుదారులు సిండికేట్‌గా మారడంతో ఎకరాకు పంటకు అయిదు బస్తాల చొప్పున మాత్రమే లీజు చెల్లిస్తున్నారు. పట్టించుకోని అధికారులు భావనారాయణ స్వామి ఆలయానికి చెందిన భూములు చాలా కాలంగా ఆక్రమణలకు గురవుతున్నా అధికారుల్లో చలనం లేదు. దేవుడి సేవలో నిమగ్నమైన వారి జీవన గమనానికి నిర్దేశించి వివిధ కుల వృత్తుల వారీగా ఇచ్చిన ఈ భూములు ప్రస్తుతం ఇతరుల చేతుల్లోకి వెళ్లాయి.ఆక్రమిత భూముల్లో ఊర్లే వెలిశాయి. కొన్ని లేఅవుట్లుగా మారి చేతులు మారాయి. 1బి రిజిస్ట్రర్లలో పేర్లు మార్పు, కొన్ని దస్త్రాలనే ప్రైవేటుగా సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. సర్పవరం గ్రామంలో కొంత భాగం ఆలయ భూములే కావడం గమనార్హం. కాకినాడ పరిసరాల్లో ఎకరా భూమి రూ.4 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పలుకుతోంది. ఈ భూముల మీదుగా జాతీయ రహదారి వెళ్తుండడంతో ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో అక్రమార్కులు బరితెగిస్తున్నారు. కాకినాడ నగర పరిధిలోని మేడలైన్‌లో సుమారు 10 ఎకరాల భూమికి సంబంధించి నెలకొన్న వివాదం ప్రస్తుతం జేసీ కోర్టులో నడుస్తోంది. 79 సర్వే నంబర్లపై నిషేధాజ్ఞలు భావనారాయణస్వామి దేవస్థానానికి చెందిన ఇనాం భూములు 191.12 ఎకరాలు పరాధీనంలో ఉన్నట్లు ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులు గుర్తించి నిషేధాజ్ఞలు విధించారు. ఆర్‌ఎస్‌ఆర్‌లో దేవస్థానానికి చెందిన నౌకరీ భూములుగా ఇవి నమోదైనట్లు గమనించారు. స్థానికంగా కీలక దస్త్రాలను మాయం చేసినా కొందరు అధికారుల చొరవతో కేంద్ర సర్వే కార్యాలయం నుంచి సంబంధిత పత్రాల నకళ్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో 22(ఎ) (1) (సి) ప్రకారం ఈ భూములు అమ్మకం, కొనడం, రిజిస్ట్రేషన్లపై నిషేధం విధిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 79 సర్వే నంబర్లలో 191.12 ఎకరాల భూములపై ఆంక్షలు విధించారు. నిషేధిత సర్వే నంబర్లలో 6, 18, 27, 33, 40, 44, 45, 46, 47, 66, 67, 69, 70, 71, 73, 74, 75 నుంచి 79 సర్వే నంబర్లు ఉన్నాయి. 81, 82, 84, 86, 88, 104, 105, 122, 126, 159, 230, 232, 244, 270, 272, 287, 289 తదితర సర్వే నంబర్లపైనా నిషేధం ఉండడం గమనార్హం. * రమణయ్యపేట పంచాయతీలో ఆలయ భూములను ఆనుకుని పంట కాలువ ఉండేది. కాలువ భూములు లేఅవుట్లుగా మారడంతో నీటి లభ్యత లేక ఆలయ భూములను లీజుకు ఇవ్వడం మానేశారు. ఇటీవలి కాలంలో ఇక్కడ ఆక్రమణలు తీవ్రమయ్యాయి. 260/1 సర్వేనంబర్‌లో 2.02 ఎకరాల పంట భూమిని దేవాదాయ శాఖ దస్త్రాల్లో ఖాళీగా ఉన్నట్లు చూపుతుండగా.. దీనిని గుట్టుచప్పుడు కాకుండా అమ్మేశారన్న వాదనలు వినవస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో ఈ భూమి జోలికి వెళ్లడానికి అధికారులు సాహసించడం లేదు. * సర్పవరంలోని 129/1 సర్వే నంబరులో 2.55 ఎకరాల ఆలయ భూమి ఉందని రెవెన్యూ యంత్రాంగం 1995లో పాసుపుస్తకం ఇచ్చింది. దేవాదాయ శాఖ ప్రాపర్టీ రిజిస్టర్‌లో దీనిని నమోదు చేయకుండా తప్పించారు. సర్పవరం పరిధిలోని ఆటోనగర్‌ ప్రాంతంలో ఈ భూమి ఉందని గతంలో పనిచేసిన అధికారులు చెబుతున్నారు. తిమ్మాపురంలో 21/1లో 8.41 ఎకరాల ఆలయ భూమి ఉంది. ఇది భావనారాయణ స్వామి ఆలయ భూమిగా పేర్కొంటూ కలెక్టరేట్‌ నుంచి 10(1) అడంగల్‌ ఇచ్చారు. ఈ భూమిని స్వాధీనం చేసుకుని కాపాడుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలితంగా ఎంతో విలువైన భూమి ఇతరుల పరమైంది. కొందరు దీనిని లేఅవుట్లుగా మార్చేసి అమ్మేశారు. ఈ భూములు ఆలయానికి చెందినవని దేవాదాయ శాఖకు 2018 వరకు తెలియకపోవడం గమనార్హం. సర్వే నంబరు 91లో 8.3 ఎకరాల కోసం వెతికే క్రమంలో ఈ భూమి విషయం వెలుగులోకి వచ్చింది. కాకినాడ గ్రామీణ మండలంలోని భావనారాయణ స్వామి దేవస్థానానికి చెందిన భూమి సామర్లకోట మండలం పనసపాడు గ్రామ సమీపంలో ఉంది. సర్వే నంబరు 256/1లో 2.34 ఎకరాల భూమి ఇక్కడ ఉన్నట్లు రెవెన్యూ దస్త్రాల్లో ఉంది. ఇందులో ప్రైవేటు లేఅవుట్‌ వేశారు. 2007లోనే ఈ భూమి భావనారాయణస్వామి ఆలయానికి చెందిందని రెవెన్యూ దస్త్రాల్లో ఉందని సమాచారం ఇచ్చిన అప్పటి సామర్లకోట తహసీల్దారు పాసుపుస్తకాలు తీసుకోవాలని దేవాదాయ శాఖకు లేఖ రాశారు. వాస్తవాలు తెలుసుకోకుండా అప్పటి ఆలయ అధికారులు, పాలకవర్గ ప్రతినిధులు ఈ భూమి ఆలయానిది కాదని రాత పూర్వకంగా ఇవ్వడంతో పరాధీనానికి ద్వారాలు తెరుచుకున్నాయి.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved