అంతా మాఫియా మయమైంది - రాజధాని నిర్మిస్తారో లేదో స్పష్టం చేయండి

అంతా మాఫియా మయమైంది - రాజధాని నిర్మిస్తారో లేదో స్పష్టం చేయండి

user-default Sathya | Mob: 9248040968 | 25 Oct

జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్త ఇసుక విధానం తీసుకువస్తామని చెప్పి తెదేపా ప్రభుత్వంలో మాదిరే ఇసుక మాఫియాను తీసుకువచ్చారని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల లక్షల మంది రోడ్డున పడ్డారని అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఇసుక రవాణాపైనే ఆధారపడ్డ ఆరు వేల లారీలకే పనుల్లేకుండా పోతే కొత్తగా మరో 6 వేల లారీలకు రుణాలు ఇప్పించేలా జీవో 486 తీసుకురావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. లారీల కోసం రుణాలు ఇప్పించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం ఆహ్వానించదగ్గదే అయినా ఉన్న లారీల సంగతి ఏమిటి? ఎవరి లబ్ధి కోసం ఈ ప్రయత్నమని ప్రశ్నించారు. జీవో 486పై పవన్‌ విమర్శలు గుప్పించారు. రాయితీతో కూడిన 6 వేల లారీలు కొనుగోలుకు ప్రభుత్వం జీవో 486 ఇస్తూ అందులో జీఎస్‌టీ మొత్తాన్ని తగ్గించే విషయాన్ని పరిశీలించాలని పేర్కొనడం శోచనీయమని అన్నారు. అన్ని రాష్ట్రాలూ రేపు ఇలాగే వ్యవహరిస్తే ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఈ జీవోపై ప్రధాన మంత్రికి జీఎస్టీ మండలికి, అమిత్‌షాకు జనసేన ఫిర్యాదు చేస్తుందని చెప్పారు. ఫేస్‌బుక్‌లో ఇసుక నిల్వలు ఉంటున్నాయే తప్ప వాస్తవంగా ఉండటం లేదన్నారు. రాజధాని ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి ఉందని..మంత్రి బొత్స సత్యనారాయణ వెటకారంగా మాట్లాడుతున్నారని అన్నారు. రాజధానిపై స్పష్టత ఇవ్వాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. అంబటి రాంబాబుపై తనకు గౌరవం ఉందని, మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలని హితవు పలికారు. ఎన్నికలు అయిదేళ్లు ఉన్నాయనుకుంటున్నారేమో, ముందే వస్తాయని అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన ప్రజలే తిరిగి దెబ్బకొట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved