370 మళ్లీ తెస్తామని చెప్పగలరా?

370 మళ్లీ తెస్తామని చెప్పగలరా?

user-default | Mob: | 22 Oct

జమ్మూ-కశ్మీర్‌లో 370 అధికరణం రద్దు అంశంపై కాంగ్రెస్‌, ఎన్‌సీపీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధైర్యముంటే సదరు నిబంధనను పునరుద్ధరిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనాలని ఆ పార్టీలకు సవాల్‌ విసిరారు. అలా చేస్తే విపక్షాలకు భవిష్యత్‌ ఉండదన్నారు. ఆ అధికరణను తిరిగి తీసుకురావడం ప్రజలకు ఆమోదయోగ్యమేనా అని ప్రశ్నించారు. ఆదివారం ఆయన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తొలిసారిగా పాల్గొన్నారు. జలగావ్‌, సాకోలిలో జరిగిన సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘జమ్మూ-కశ్మీర్‌ కేవలం ఒక భూభాగం మాత్రమే కాదు. భారత్‌కు మకుటం’’ అని వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్రంలో 40 ఏళ్లుగా నెలకొన్న కల్లోల పరిస్థితులను సాధారణ స్థాయికి తీసుకురావడానికి నాలుగు నెలలకు మించి సమయం పట్టదని భరోసా ఇచ్చారు. 370 అధికరణంపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. పొరుగు దేశం తరహాలో మాట్లాడుతున్నాయన్నారు. జమ్మూ-కశ్మీర్‌పై దేశ ప్రజల భావనలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, ఎన్‌సీపీ నేతల ఆలోచనలు ఉన్నాయని దుయ్యబట్టారు. ‘‘జమ్మూ-కశ్మీర్‌, లద్ధాఖ్‌లో వాల్మీకి వర్గానికి చెందిన వారికి మానవ హక్కులు కూడా లేవు. నేడు భగవాన్‌ వాల్మీకి ఎదుట శిరస్సు వంచి చెబుతున్నా.. ఆ వర్గానికి చెందిన సోదరులను అక్కున చేర్చుకునే అదృష్టం నాకు దక్కింది’’ అని చెప్పారు. ముమ్మారు తలాక్‌ అంశంపై కూడా ఆయన విపక్షాలను దుయ్యబట్టారు. ముస్లిం సోదరీమణులకు న్యాయం జరగకుండా అడ్డుకోవడానికి ఆ పార్టీలు ప్రయత్నించాయని ఆరోపించారు. ముమ్మారు తలాక్‌ను కూడా తిరిగి తీసుకొస్తామని ప్రకటించాలని విపక్షాలకు సవాల్‌ విసిరారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved