ఇథియోపియా ప్రధానికి నోబెల్‌ శాంతి

ఇథియోపియా ప్రధానికి నోబెల్‌ శాంతి

user-default | Mob: | 31 Oct

ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతిని పురస్కార కమిటీ ప్రకటించింది. 2019 ఏడాదికి గానూ ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్‌ అలీకి నోబెల్‌ శాంతి పురస్కారాన్ని అందజేస్తున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ సహకారం, శాంతి స్థాపనకు ఆయన చేసిన సేవలకు ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు నోబెల్‌ కమిటీ తెలిపింది. ముఖ్యంగా తమ సరిహద్దు దేశమైన ఎరిట్రియాతో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేసిన కృషికి అబీ అహ్మద్‌కు అరుదైన గౌరవం దక్కింది. అబీ అహ్మద్‌ అలీ 2018 ఏప్రిల్‌ 2న ఇథియోపియా నాలుగో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. దశాబ్దాల నాటి ఇథియోపియో-ఎరిట్రియా సరిహద్దు వివాద పరిష్కారం కోసం అబీ అహ్మద్‌ ఎంతగానో కృషి చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఎరిట్రియా అధ్యక్షుడితో పలుమార్లు చర్చలు జరిపి వివాదాన్ని పరిష్కరించారు. అదొక్కటే కాదు.. దేశ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఇథియోపియా ప్రజల భవిష్యత్‌ కోసం ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన తొలి 100 రోజుల్లో అత్యయిక స్థితిని ఎత్తేశారు. రాజకీయ నేరస్థులను జైళ్ల నుంచి విడుదల చేశారు. అవినీతికి పాల్పడ్డ సైనిక, పౌర అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించారు. రాజకీయాలు, ఇతర రంగాల్లో మహిళల పాత్ర పెంచేందుకు కృషి చేశారు. తన కేబినెట్‌లో సగం మంది మహిళలను తీసుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు అబీ అహ్మద్‌ ఆర్మీ ఇంటెలిజెన్స్‌ అధికారిగా పనిచేశారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved