సీఎం జగన్ సభలో.. డిప్యూటీ సీఎంకు, ఎంపీ గోరంట్ల మాధవ్‌కు చేదు అనుభవం

సీఎం జగన్ సభలో.. డిప్యూటీ సీఎంకు, ఎంపీ గోరంట్ల మాధవ్‌కు చేదు అనుభవం

user-default | Mob: | 24 Oct

అనంతపురం నగరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంత జిల్లా సమస్యలు తనకు తెలుసుననీ.. వాటన్నింటినీ తీర్చే బాధ్యత తనదని ఆయన హామీ ఇచ్చారు. హంద్రీనీవా ప్రాజెక్టున్నా.. 2 వేల క్యూసెక్కుల నీటిని జిల్లాకు తీసుకురాలేకపోతున్నారన్నారు. హంద్రీనీవా కాలువ వెడల్పు చేయడంతో పాటు పక్కనే సమాంతర కాలువ ఏర్పాటు చేయనున్నామన్నారు. కరువుకు ఈ జిల్లా ఆలవాలంగా మారిందన్నారు. అందరి మన్ననలు పొందేలా పాలన చేస్తానని హామీ ఇస్తున్నానన్నారు. గత పాలకులు అనంత ఆస్పత్రి గురించి ఎన్నడూ పట్టించుకోలేదన్నారు. అనంత ఆస్పత్రి గురించి తాను చెప్పనక్కరలేదని, ఇక్కడ ఏం జరుగుతోందో జిల్లా ప్రజలకు బాగా తెలుసునన్నారు. అందుకే ఆస్పత్రులను ఆదర్శంగా నిలిపేదిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నాడు..నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రస్తుతం ఆస్పత్రులు ఎలా ఉన్నాయో? పునరుద్ధరణ తరువాత ఎలా ఉంటాయో ఫొటోలతో సహా చూపబోతున్నామన్నారు. కాగా.. వైఎస్సార్‌ కంటి వెలుగు ప్రారంభ సభలో డిప్యూటీ ముఖ్యమంత్రి ఆళ్ల నానికి ముఖ్యమంత్రి ప్రత్యేక భద్రతా సిబ్బంది వల్ల చేదు అనుభవం ఎదురైంది. గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి స్టాల్స్‌ను సందర్శించారు. అయితే ముఖ్యమంత్రి ఒక స్టాల్‌ నుంచి మరో స్టాల్‌కు వెళ్లే సమయంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఆయన వెంటే నడవడానికి ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో సీఎం భద్రతా సిబ్బంది మంత్రి ఆళ్లనానిని పక్కకు నెట్టారు. మరో రెండు నిమిషాలు అనంతరం హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు అదే పరిస్థితి ఎదురైంది. సీఎం భద్రతా సిబ్బంది అలా చేయడంతో నేతలు ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితి ఎదురైంది.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved